లోక కళ్యాణం అఖండ పారాయణం
పులకించిన భక్తులు..సప్త గిరులు
తిరుమల – లోక కల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల లోని నాద నీరాజనం వేదికపై నిర్వహించిన 12వ విడత అయోధ్య కాండ అఖండ పారాయణం భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
అయోధ్య కాండలోని 45 నుండి 49వ సర్గ వరకు మొత్తం ఐదు సర్గల్లో 141 శ్లోకాలు, యోగ వాశిష్టం , ధన్వంతరి మహా మంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 166 శ్లోకాలను పారాయణం చేశారు.
ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా. రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, డా.మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వ విద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తేజోవతి బృందం “శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్ము నేలు కౌసల్య నందన …. ” అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, “ హరి హరి రామ నన్నరమర జూడకు నిరతము నీ నామ స్మరణ మేమరను దశరధ నందన ……” అనే సంకీర్తనను చివరిలో రస రమ్యంగా ఆలపించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.