NEWSANDHRA PRADESH

బుల్డోజ‌ర్ సంస్కృతి మంచిది కాదు

Share it with your family & friends

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్

న్యూఢిల్లీ – స‌మాజ్ వాది పార్టీ చీఫ్ , ఎంపీ అఖిలేష్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కొన‌సాగుతున్న దాడుల‌కు వ్య‌తిరేకంగా వైసీపీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లు పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.

ఈ సంద‌ర్బంగా పాల్గొని మ‌ద్ద‌తు తెలిపారు అఖిలేష్ యాద‌వ్. జ‌గ‌న్ న‌న్ను ఆహ్వానించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఒక‌వేళ ఇక్క‌డికి రాక పోయి ఉండి ఉంటే త‌న‌కు ఇన్ని వాస్త‌వాలు తెలిసి ఉండేవ‌ని కావ‌న్నారు.

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవన్నీ చూసిన తరవాత, నేను ఒక విషయం స్పష్టం చేయదల్చుకున్నాన‌ని అన్నారు. అధికారంలో ఉన్న వారు సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు అఖిలేష్ యాద‌వ్.

ప్రజల సమస్యలు పట్టించు కోవాలని, ఎదుటివారు చెప్పేది వినాలని, కానీ వారి ప్రాణాలు తీస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలు పెట్టినట్లు.. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన తరవాత అర్ధమైందన్నారు.

పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం.. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.