Tuesday, April 22, 2025
HomeDEVOTIONAL13న అక్క దేవ‌త‌లకు పూజ‌లు

13న అక్క దేవ‌త‌లకు పూజ‌లు

టీటీడీ డ్రైవ‌ర్లు..స్థానికులు పూజ‌లు

తిరుమల – తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్క దేవతల గుడిలో ఏడుగురు అక్క దేవతలకు 13వ తేదీన‌ టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజలు నిర్వహించనున్నారు. అక్కగార్లకు ప్రతి సంవత్సరం కార్తీక మాసపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

తిరుమల మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణిలు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా ఆ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు.

సదా తన భక్తులకు అభయ ప్రదానం చేస్తూ అభయవరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన ఏడుకొండల వాడికే ఆడపడుచులుగా పేరొంది అక్కగార్లు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువు దీరి ఉన్నారు.

అక్కగార్ల గుడి నిర్మాణం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. 1940 దశకంలో మొదటి కనుమ దారి నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. ఆ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. ప్రమాదాలు జరిగాయి. ఈ తరుణంలో స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్త మాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతికింద ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు సాఫీగా పూర్తయింది.

2008 నుండి అక్కగార్ల గుడిలో సంవత్సరంలో కార్తీక మాసంలో ఒక రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రారంభించింది. అప్పటినుండి మొదటి ఘాట్ రోడ్ లోని అవ్వాచారి కోన వద్ద వెలసి ఉన్న అక్కగార్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments