ENTERTAINMENT

అక్కినేని నాగార్జున ఆవేద‌న

Share it with your family & friends

ఎన్ – క‌న్వెన్ష‌న్ కూల్చివేతపై

హైద‌రాబాద్ – న‌టుడు అక్కినేని నాగార్జున ఎన్ – క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ కూల్చి వేత‌పై స్పందించారు. శ‌నివారం ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఎక్స్ ఖాతాలో కీల‌క పోస్ట్ చేశారు. తాము ఎలాంటి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

స్టే ఆర్డ‌ర్లు..కోర్టు కేసుల‌కు విరుద్దంగా ఎన్ – క‌న్వెన్ష‌న్ కు సంబంధించి కూల్చి వేయ‌డం చేప‌ట్ట‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు నాగార్జున‌. త‌మ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసేందుకు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మ‌ని వాపోయారు. కొన్ని వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ చేయ‌డం త‌న ధ‌ర్మ‌మ‌ని తెలిపారు.

తాము చ‌ట్టాన్ని గౌర‌విస్తామే త‌ప్పా, ఎలాంటి ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు అక్కినేని నాగార్జున‌. తాము నిర్మించిన ఎన్ – క‌న్వెన్ష‌న్ పూర్తిగా ప‌ట్టా భూమి అని, అందుకే తాము నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

ఒక్క అంగుళం కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురి కాలేద‌న్నారు. ప్రైవేట్ స్థ‌లంలో నిర్మించిన భ‌వ‌న‌మ‌ని తెలిపారు. కూల్చివేత కోసం గ‌తంలో ఇచ్చిన అక్ర‌మ నోటీస్ పై స్టే కూడా మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

త‌ప్పుడు స‌మాచారం కార‌ణంగా కూల్చి వేశారంటూ వాపోయారు. కూల్చి వేసే ముందు త‌మ‌కు నోటీసు కూడా ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు నాగార్జున‌. కేసు కోర్టులో ఉన్న‌ప్పుడు ఇలా చేయ‌డం స‌రికాద‌న్నారు. ఒక‌వేళ ముందే చెప్పి ఉంటే తానే కూల్చి వేసే వాడిన‌ని అన్నారు.

తాజా పరిణామాల వల్ల, తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంద‌న్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే త‌మ ప్రధాన ఉద్దేశమ‌ని తెలిపారు.

అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామ‌ని, అక్క‌డ త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు నాగార్జున‌.