ఒక్క సెంటు భూమి ఆక్రమించు కోలేదు
స్పష్టం చేసిన నటుడు అక్కినేని నాగార్జున
హైదరాబాద్ – ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎన్ – కన్వెన్షన్ సెంటర్ ను అక్రమంగా నిర్మించ లేదని స్పష్టం చేశారు.
మాధాపూర్ లో తాను గతంలో ప్రభుత్వానికి చెందిన భూమిని ఆక్రమించు కోలేదని పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తన గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయని తెలిపారు.
ఎన్-కన్వెన్షన్ నిర్మించ బడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని తాను పునరుద్ఘాటించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు అక్కినేని నాగార్జున. ప్రైవేట్ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని, ఒక్క ఈంచు కూడా తాను ఆక్రమించు కోలేదని పేర్కొన్నారు .
తుమ్మిడికుంట సరస్సులో ఎలాంటి ఆక్రమణలు జరగ లేదని 24-02-2014న ఏపీ భూ సేకరణ (నిషేధం) చట్టం ప్రత్యేక న్యాయస్థానం Sr.3943/2011 ఉత్తర్వును జారీ చేసిందని వెల్లడించారు .
ఈ తీర్పు నివేదికను ఆధారంగా చేసుకుని తాను నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇదే విషయాన్ని గౌరవనీయ హైకోర్టు ముందు సమర్పించడం జరిగిందన్నారు. అప్పటి వరకు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ఆరోపణలు చేయొద్దని సూచించారు అక్కినేని నాగార్జున.