శభాష్ రంగనాథ్ ఆకునూరి కంగ్రాట్స్
ఇలాంటి అధికారులే రాష్ట్రానికి కావాలి
హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ , మజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాజాగా హైదరాబాద్ లో చెరువులను కబ్జా చేసి, నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న హైడ్రా కమిషనర్ , సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లు రాష్ట్రానికి కావాలని పేర్కొన్నారు.
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చేశారని, రూల్స్ కు విరుద్దంగా ఆక్రమణలకు పాల్పడ్డారని ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు ఆకునూరి మురళి. ప్రధానంగా హైదరాబాద్ ను కాలుష్య నగరంగా మార్చడానికి వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్డీఎఫ్ కన్వీనర్.
లక్షల కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించు కున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రాణాలను రక్షించే చెరువులను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా ఆకాశ హార్మ్యాలు కనిపిస్తున్నాయని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయని వాపోయారు.
ఎవరికీ తల వంచకుండా దాడులు చేపట్టాలని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆకునూరి మురళి.