భట్టికి అవమానం ఆకునూరి ఆగ్రహం
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదు
హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) చీఫ్ , మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. యాదాద్రి ఆలయం సాక్షిగా డిప్యూటీ సీఎం, దళితుడైన మల్లు భట్టి విక్రమార్కకు జరిగిన ఘోరమైన అవమానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలో అందరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ప్రకారంగా చూసినా ముందు సీఎం ఆ తర్వాత డిప్యూటీ సీఎంను కూర్చో బెట్టాల్సిన బాధ్యత ఆలయ కమిటీపై ఉంటుందని పేర్కొన్నారు. ఒక వేళ వారికి తెలియక పోయినా అత్యున్నతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గమనించక పోవడం దారుణమని అన్నారు ఆకునూరి మురళి.
ప్రజలు దేనినైనా భరిస్తారు కానీ ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే అది ఎంతటి వారినైనా పక్కన పెడతారని, ఇది తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో రూఢీ అయ్యిందని స్పష్టం చేశారు. కుల వివక్ష, సామాజిక న్యాయం అనేది ఇంకా సమాజంలో ఉండడం బాధను కలిగిస్తోందని వాపోయారు. ప్రోటోకాల్ గురించి రేవంత్ కంటే ఎక్కువగా కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డికి తెలిసినా ఎందుకని మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ఆకునూరి మురళి.