NEWSTELANGANA

మ‌తం పేరుతో ఓట్ల రాజ‌కీయం

Share it with your family & friends

యువ‌త ఆలోచించ‌క పోతే న‌ష్టం

హైద‌రాబాద్ – సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫోర‌మ్ (ఎస్డీఎఫ్‌) క‌న్వీన‌ర్, మాజీ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సంబంధించి తొలి విడ‌త నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

దీంతో ఎన్నిక‌ల పండుగ మొద‌లైంది. కానీ 143 కోట్ల మంది కొలువుతీర‌న భార‌త దేశంలో ఇంకా పేద‌రికం , చ‌దువు కునేందుకు నోచుకోక పోవ‌డం, ఉపాధి అవ‌కాశాలు లేక పోవ‌డం, విద్య‌, వైద్య‌, ఉపాధి రంగాల‌కు దూరం కావ‌డం ఎంత దుర్భ‌ర‌మంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆకునూరి ముర‌ళి.

మ‌తం మ‌త్తు మందు లాంటిది అన్న కార్ల్ మార్క్స్ ను మ‌రోసారి గుర్తుకు తెచ్చేలా చేస్తోంది బీజేపీ అంటూ వాపోయారు. ఈ దేశ భ‌విష్య‌త్తు ప్ర‌ధానంగా యువ‌తీ యువ‌కుల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. ఈ స‌మ‌యంలో ఇక‌నైనా మేలుకోక పోతే , మీ విలువైన ఓటును ఉప‌యోగించుకోక పోతే తీవ్రంగా న‌ష్ట పోతామ‌ని హెచ్చ‌రించారు.

అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి బ‌డా బాబుల‌కు, కార్పొరేట్ సంస్థ‌ల‌కు, వ్యాపార‌వేత్త‌ల‌కు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, ఆర్థిక నేర‌గాళ్ల‌కు మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని ఆరోపించారు. మ‌తం పేరుతో దేశంలో మ‌రోసారి ఓట్ల రాజకీయానికి తెర లేపారంటూ మండిప‌డ్డారు.