నిప్పులు చెరిగిన ఆకునూరి మురళి
హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ చీఫ్ పదవికి రాజీనామా చేసి కేసీఆర్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్పీని ఏకి పారేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆకునూరి మురళి స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ప్రస్తుత రాజకీయాలలో కొందరు నేతలు పదే పదే మహనీయుల పేర్లను ఉచ్చరించడం పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. దీనిని ఓ ఎత్తుగడగా పేర్కొన్నారు ఆకునూరి మురళి. పేరొందని వారి భావ జాలాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు.
గతంలో తమ కాలంలో చేసిన రాజకీయ ప్రయోగాలను తమకు ఇష్టం వచ్చినట్టు ఆపాదించు కోవడం పై ఫైర్ అయ్యారు. తమ కులాన్ని పెత్తనం చేసే కులాల దగ్గర తాకట్టు పెట్టడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు.
రోజుకొక పార్టీతో బేర సారాలు ఆడడం, చివరకు ఏదో ఒక పార్టీతో జత కట్టడం ఎత్తుగడలో భాగమేనని మండిపడ్డారు. చట్ట సభలకు పోవాలనే కోరికతో విలువలను పాతరేయడం కాదా అని నిలదీశారు. ఎన్ని అబద్దాలు ఆడినా పర్వా లేదు..కానీ తమకు పదవి దక్కితే చాలని అనుకోవడం, తమ వారితో సోషల్ మీడియాలో దాడి చేయడం మంచి పద్దతి కాదన్నారు.