Tuesday, April 15, 2025
HomeDEVOTIONALటిటిడి గోశాల‌లో గోవులపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ

టిటిడి గోశాల‌లో గోవులపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ

స్ప‌ష్టం చేసిన టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు

తిరుప‌తి – టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో జె శ్యామల రావు స్ప‌ష్టం చేశారు. గత పాలనలో జరిగిన అవకతవకలను సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు టిటిడి గోశాలలో పలు అక్రమాలు, అవకతవకలు జరిగాయని అప్పటి విజిలెన్స్ నివేదికలలో తేట తెల్లమవుతోందన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమైనా ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదన్నారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం మూలంగా రెండు సార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. దాణా, మందుల సరఫరా కాంట్రాక్ట్ లోను భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇపుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు.

గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలే దని, ఇపుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చని, చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు ఈవో జె. శ్యామ‌ల రావు. టిటిడి గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయన్నారు. టిటిడి గోశాలలో 100 ఆవులు అనుమానాస్పదంగా మరణించాయని, టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో మాజీ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేసిన ఆరోపణలను నిరాధారమైనవని ఆరోపించారు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసిన ఆరోపణలను ఈఓ తోసిపుచ్చారు.

గోవులు ప్రతి నెల సగటున 15 ఆవులు వయోభారం, వ్యాధులతో చనిపోతాయని చెప్పారు. 2024 ఏడాది నాటికి 179 గోవులు మరణించగా, 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనన్నారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయన్నారు. కరుణాకర్ రెడ్డికి నిజంగా గోవుల మీద ఆందోళన వుంటే వారి పాలనలో జరిగిన అక్రమాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్ర‌శ్నించారు. టిటిడి గోశాలకు కొత్తగా డైరెక్టర్ వచ్చాక ఈ అవకతవకలు, అక్రమాలు, నిర్లక్ష్యం తదితర అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలో దళారులకు అడ్డాగా మారిన టిటిడిని , ఇపుడు దళారులపై పూర్తిగా కట్టడి చేసి చర్యలు చేపట్టామన్నారు.

గత జూన్ నుండి టిటిడిలో అన్నప్రసాదం, శ్రీవారి ప్రసాదాల రుచిని పెంచడం, లడ్డూ నాణ్యత, సేవలలో పారదర్శకత, దర్శన టిక్కెట్లు , వసతి, దళారులను కట్టడి చేయడం, టిటిడి ఐటీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. టిటిడి ఐటీ విభాగంలో అనర్హుని ఐటీ జీఎంగా చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ హోదాలో నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, అక్రమ నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గత జూన్ నెలకు ముందు శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరాదారులపై చర్యలు చేపట్టి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు.

అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల తయారీకి సేంద్రీయ ఉత్పత్తులను విరాళంగా ఇచ్చే పేరుతో, దాతలు రూ.5 కోట్ల విలువైన కల్తీ సేంద్రీయ ఉత్పత్తులను సరఫరా చేసినందుకు, దాదాపు రూ.25 కోట్ల వరకు దాతలకు టిటిడిలో పలు ప్రివిలేజేస్ కల్పిస్తూ పాస్ పుస్తకాల ప్రయోజనాన్ని పొందేలా నిర్ణయాలు తీసుకున్నారని, నిబంధనల ప్రకారం ఇలాంటి విరాళాలకు ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకున్నా ప్రివిలేజ్డ్ పాస్ పుస్తకాలు జారీ చేశారన్నారు. ఇలాంటి అక్రమాలను తాము రద్దు చేశామని ఈవో మీడియా ముందు చెప్పారు .

ఈ సమావేశంలో టిటిడి జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్, ఇన్-చార్జ్ డైరెక్టర్ ఎస్వీ గోశాల శ్రీనివాసులు, వీజీఓ విజిలెన్స్ రామ్‌కుమార్, తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments