అల్లు అర్జున్ పై కేసు నమోదు
పర్మిషన్ లేకుండా ప్రచారం
నంద్యాల జిల్లా – ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటించారు. నంద్యాల శాసన సభ నియోజకవర్గం నుంచి తన స్నేహితుడు, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్సా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల కేంద్రం నిర్దేశించిన రూల్స్ ను అతిక్రమించినందుకు గాను అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నటులైనా లేదా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఎవరైనా సరే ప్రచారం చేయాలంటే ముందుగా ఈసీ నియమించిన నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పర్మిషన్ తీసుకోవల్సి ఉంటుంది.
కాగా అల్లు అర్జున్ అభ్యర్థితో కలిసి వేలాది మంది నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే నంద్యాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని స్పష్టం చేశారు రిటర్నింగ్ ఆఫీసర్ పి. రామచంద్రరావు. స్పెషల్ డిప్యూటీ తహసిల్దార్ ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
ఎన్నికల కోడ్ , 31 ఏపీ యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉన్నందు వల్ల పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలవడం నేరమని పేర్కొన్నారు . ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ తో పాటు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.