మరోసారి విచారించనున్న పోలీసులు
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవుతారు. ఈ సందర్బంగా ఆయనను పోలీసులు మరోసారి విచారణ చేపడతారు. ఇప్పటికే చంచల్ గూడ జైలుకు వెళ్లారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇదే సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బన్నీ. ఆయనపై సీఎం నిప్పులు చెరిగారు.
మరో వైపు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. లీగల్ పరంగా ఎదురయ్యే చిక్కుల నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై సమాలోచనలు జరిపారు అల్లు అర్జున్, అల్లు అరవింద్. మరో వైపు పిల్లను ఇచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీపై గరంగరంగా ఉన్న కాంగ్రెస్ సర్కార్ ను కలిసేందుకు ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ సలహాదారు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గా ఉన్న దీపా దాస్ మున్షీని కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె పట్టించు కోలేదని సమాచారం. అక్కడి నుంచి నేరుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. తన గోడు వెళ్ల బోసుకున్నారు. ఎలాగైనా సరే బన్నీని గట్టెక్కించాలని కోరారు. మరో వైపు సీరియస్ గా ఉన్న సీఎంను కూల్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.