వైసీపీ అభ్యర్థికి పుష్ప ప్రచారం
శిల్పా రవి కిషోర్ రెడ్డిని గెలిపించండి
నంద్యాల జిల్లా – మెగా ఫ్యామిలీకి చెందిన బన్నీ అలియాస్ అల్లు అర్జున్ వైరల్ గా మారారు. ఆయన శనివారం నంద్యాల జిల్లాలో ప్రత్యక్షం అయ్యారు. షూటింగ్ కోసం అనుకుంటే పొరపాటు పడినట్లే. కాదు పవన్ కళ్యాణ్ నిత్యం ద్వేషించే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన నంద్యాల బరిలో ఉన్న శిల్పా రవి కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు.
ఇది అభిమానులనే కాదు ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది. మెగా ఫ్యామిలీ ఆస్తులన్నీ ఇటు ఏపీలో అటు తెలంగాణలో ఉన్నాయి. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండడంతో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో సత్ సంబంధాలు ఉన్నాయి.
బన్నీ ఏరికోరి తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు స్నేహా రెడ్డి. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ప్రముఖ ఆస్పత్రి అపోలో సంస్థల చైర్మన్ మనుమరాలైన ఉపాసనను పెళ్లి చేసుకోవడం విశేషం.
ఓ వైపు మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు , పవన్ కళ్యాణ్ లు జనేసేన పార్టీతో జగన్ రెడ్డిని తరిమి వేయాలని పిలుపునిస్తున్నారు. మరో వైపు ఇదే ఫ్యామిలీకి చెందిన బన్నీ వైసీపీ అభ్యర్థిని గెలిపించమని కోరడం విశేషం కదూ.