రాజధాని..అన్నా క్యాంటీన్లకు విరాళాల వెల్లువ
అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి, అన్నా క్యాంటీన్ల నిర్వహణకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ చేపట్టారు. 5 వేల మందికి పైగా బాధితులు సీఎంను కలిసి వినతి పత్రాలు సమర్పించారు.
ఇందులో భాగంగా ఏపీకి చెందిన పలువురు అమరావతి నిర్మాణానికి, అన్నా క్యాంటీన్ల నిర్వహణకు తమ వంతుగా విరాళాలు అందజేశారు. ఏపీ సీఎంకు దాతలు చెక్కులు అందించారు. కంకిపాడుకు చెందిన రైతు ఎన్.ప్రభాకర్ రావు రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన జి.వీ.మాణిక్యమ్మ అనే వృద్ధురాలు తన చేతికున్న బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందించారు.
భగవద్గీత గ్రూపు తరుపున నిర్మల అనే వృద్ధురాలు రూ.3.42 లక్షలను విరాళంగా ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్లపల్లికి చెందిన జీవన్ కుమార్ అనే దివ్యాంగుడు రూ.25 వేలు, చిత్తూరుకు చెందిన వల్లేరు వెంకటేశ్ నాయుడు లక్ష రూపాయలను రాజధానికి విరాళంగా అందించారు.
విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన పర్చూరి రాజబాబయ్య, కమల కుమారి అనే వృద్ధులు అన్న క్యాంటీన్ కు రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. వీరందరికీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.