నిప్పులు చెరిగిన అంబటి రాంబాబు
అమరావతి – ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోసారి జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు. ఇవాళ టికెట్లను ఖరారు చేసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి.
శనివారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ పల్లకీ మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిదని సూచించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అదే పని చేశాడంటూ ఎద్దేవా చేశారు.
గతంలో ప్రజా రాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టికెట్లను అమ్ముకున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. మారిన రాజకీయ సమీకరణల అనంతరం ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పని చేశారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి పురందేశ్వరి కలిసినా ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు తెర తీసినా చివరకు మిగిలేది ఏమీ ఉండదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా రెండోసారి వైసీపీ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు అంబటి రాంబాబు.