మాజీ మంత్రి అంబటి రాంబాబు
అమరావతి – మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో మిర్చి యార్డ్ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందంటూ సాకు చెబుతున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదని, ప్రచారం చేయడం లేదని, కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడడం లేదన్నారు. జగన్ టూర్ కు ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేశారు. మాజీ సీఎంకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు.
ఏపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓ వైపు రైతులు కనీస మద్దతు ధర అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. ఎన్నికల కోడ్ వంకతో జగన్ రెడ్డిని రాకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తమను ఇబ్బంది పెడితే వాళ్లు ఇబ్బంది పడడ్ం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.
మిర్చి ధర సగానికి సగం పడిపోయిందని, మాజీ సీఎంగా రైతులను పరామర్శించాలని అనుకోవడం తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి. ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరోటి కాదన్నారు. ఈ సర్కార్ కు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందిందంటూ ఆరోపించారు.