వైఎస్సార్సీపీ లో ఆయనే నిజమైన కోటరీ
అమరావతి – మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే తాను పార్టీకి దూరమయ్యానంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీలోనే విజయ సాయి రెడ్డే అసలైన కోటరీగా ఉంటూ వచ్చారని, ఆయనకు జగన్ ఇచ్చినంత ప్రయారిటీ ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. ఆ విషయం తనకే కాదు పార్టీలోని వారందరికీ , ప్రజలకు కూడా తెలుసన్నారు. విజయ సాయి రెడ్డి పోతూ పోతూ ఇలా అభాండాలు వేయడం దారుణమన్నారు. ఎవరి ప్రలోభాలకు లోనయ్యారో తను ఇలా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.
మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒకప్పుడు ఆడిటర్ గా ఉన్న సమయంలోనే దివంగత నాయకుడు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలిచి కుటుంబంలో, పార్టీ పరంగా ప్రాధాన్యత కల్పించిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పవర్ ను అనుభవించడమే కాకుండా రాజ్యసభ సీటు పొందిన విజయ సాయి రెడ్డి పవర్ లో లేక పోయే సరికల్లా పార్టీని వీడడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. తను పార్టీలో ఉండాలా లేదా అనే విషయం తన వ్యక్తిగతమని, కానీ కోటరీ ఉందని అందుకే వెళ్లి పోయానంటూ జగన్ మోహన్ రెడ్డిపై అభాండాలు వేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు అంబటి రాంబాబు.