మార్గదర్శి మోసం నిజం – అంబటి
మాజీ మంత్రి రాంబాబు షాకింగ్ కామెంట్స్
అమరావతి – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వ్యాఖ్యలు మార్గదర్శి విషయంలో చేసిందని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేవలం పేపర్, మీడియాను అడ్డం పెట్టుకుని దివంగత రామోజీ రావు మార్గదర్శిలో రూల్స్ కు విరుద్దంగా డబ్బులు చిట్టీల పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అడ్డగోలు దందాను బట్ట బయలు చేసిన చరిత్ర దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందన్నారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మార్గదర్శిలో ఇప్పటి వరకు సరైన లెక్కలు ఎందుకు చూపించ లేదని ప్రశ్నించారు.
రామోజీరావు తన మీడియాను అడ్డం పెట్టుకుని అనేకమైన చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. తన చిట్ ఫండ్స్ ను, తన కంపెనీలను, తన ఫైనాన్స్ ను 5 దశాబ్దాలుగా చట్టాన్ని అతిక్రమించి చేసుకుంటూ వచ్చారని మండిపడ్డారు అంబటి రాంబాబు.
2006లో సీఎం విచారణకు ఆదేశించారని, ఈ మొత్తం వ్యవహారాన్ని ఆధారాలతో సహా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బట్ట బయలు చేశారని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఏది ఏమైనా ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.