ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా
తిరుపతి – తిరుపతిలో ఏర్పాటు చేసిన రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ భవనాలను కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా వర్చువల్ గా ప్రారంభించారని తెలిపారు ఎస్పీ మణికంఠ చందనవోలు. షాతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , డీజీపీ ద్వారకా తిరుమల రావు పాల్గొన్నారని పేర్కొన్నారు. నేర పరిశోధనకు సంబంధించి కీలకమైన ఆధారాలను కనుగొనేందుకు ఇది దోహద పడుతుందన్నారు.
డీఎన్ఏ విభాగం ఫోక్సో కేసులు, ఇతర గంభీరమైన కేసులకు సంబంధించిన డీఎన్ఏ శాంపిళ్లను ఇక్కడనే టెస్ట్ చేయడం జరుగుతుందన్నారు ఎస్పీ. ఒకప్పుడు విజయవాడకు పంపాల్సిన అవసరం ఉండేది ఆని, ఈ సేవలను తక్షణమే స్థానికంగా పొందడం సులభమవుతోందని చెప్పారు.
ప్రత్యేకంగా ఆడియో, వీడియో టేపులకు సంబంధించి నేర పరిశోధనలు, నేర ఆధారాల సేకరణ ఇక్కడ నిర్వహించబడుతుందని, ప్రస్తుత రోజుల్లోసైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగీ సమస్యగా మారుతున్న నేపధ్యంలో, సైబర్ నేరాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, చిన్నచిన్న ఆధారాలను కూడా నిశితంగా పరిశీలించేందుకు ఈ ల్యాబ్ ప్రాముఖ్యత కలిగి ఉంటుందని అన్నారు.
తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి నేర నిరూపణ ప్రక్రియ వేగవంతం అవుతుందని, పది రోజుల్లోపే ఫలితాలు లభ్యమయ్యే అవకాశం ఉన్నందున నేర విచారణల సమర్థతను మెరుగు పరచడం ద్వారా న్యాయ సంస్థకు కీలకమైన మద్దతు లభించి, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షపడేలా అవకాశం ఉంటుందన్నారు. బాధితులకు కూడా సకాలంలో న్యాయం జరుగుతుందని తెలిపారు.
ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధ్వర్యంలో నేర విచారణలో సాంకేతిక నైపుణ్యాలను మరింతగా వినియోగించి, న్యాయవ్యవస్థలో న్యాయం వేగవంతంగా జరగాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.