కాషాయానిదే భాగ్య నగరం
ప్రకటించిన కేంద్ర మంత్రి షా
హైదరాబాద్ – ఆరు నూరైనా సరే ఈసారి హైదరాబాద్ లో ఎగిరే జెండా బీజేపీదేనని ఇంక వేరే ఏ జెండా ఎగిరే ప్రసక్తి లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి గా బరిలోకి దిగిన కొంపెల్ల మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేపట్టారు.
ఈ సందర్బంగా నిర్వహించిన రోడ్ షోకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. అడుగడుగునా హారతి పట్టారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అమిత్ చంద్ర షా. ఇక నుంచి ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. తాము ఉన్నంత వరకు ఏ ఒక్కరు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరని, ఒకవేళ చేస్తే వాళ్లకు తమ పవర్ ఏమిటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు అమిత్ షా.
ఇన్నాళ్ల పాటు తాము ఆడిందే ఆటగా నడిచిందని, కానీ ఇక బీజేపీ వచ్చాక ఎవరి ఆటలు తమ ముందు సాగవని, ఈ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ఈ దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో బీజేపీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
సమర్థవంతమైన నాయకత్వం కలిగిన ఏకైక పార్టీ తమదని పేర్కొన్నారు. ప్రధానిగా తిరిగి మోదీ ముచ్చటగా మూడోసారి కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు హోం శాఖ మంత్రి.