పీఓకే విలీనం ఖాయం – అమిత్ షా
బీజేపీ పవర్ లోకి వస్తుందన్న మంత్రి
న్యూఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరు నూరైనా సరే భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.
దేశ ప్రధాన మంత్రిగా సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన నరేంద్ర దామోదర దాస్ మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం తప్పదన్నారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు అమిత్ చంద్ర షా.
గతంలో కాంగ్రెస్ పాలన కారణంగా దేశం వందేళ్లు వెనక్కి వెళ్లిందంటూ ఆరోపించారు. కానీ తాము వచ్చాక దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లేలా కృషి చేశామని చెప్పారు కేంద్ర మంత్రి. తమ పార్టీకి కనీసం 400 సీట్లకు పైగానే వస్తాయని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఇటు నార్త్ అటు సౌత్ లలో దుమ్ము రేపడం ఖాయమని జోష్యం చెప్పారు. జూన్ 4 తర్వాత దేశం కాషాయ రెప రెప లాడడాన్ని చూస్తారని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత భూ భాగాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.