కాంగ్రెస్ ఖేల్ ఖతం – షా
బీజేపీకి 400 సీట్లు ఖాయం
సికింద్రాబాద్ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బరిలో నిలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఆరు నూరైనా సరే తెలంగాణలో భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఆదరణ లభిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మ వద్దని కోరారు. ఆరు గ్యారెంటీలు కావని అవి కేవలం గారడీలు మాత్రమేనని ఎద్దేవా చేశారు అమిత్ చంద్ర షా.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే అభివృద్దికి మంగళం పాడినట్టేనని అన్నారు. దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో ప్రధాన మంత్రిగా మరోసారి నరేంద్ర మోదీని ఎన్ను కోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈటల రాజేందర్ అత్యంత సమర్థవంతుడైన నాయకుడని కొనియాడారు.
ఈటలకు ఓటు వేసి, మోదీని బలపర్చాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్వ షా.