మీ ఓట్లు మాకు బదిలీ కావాలి
చంద్రబాబుకు అమిత్ షా టార్గెట్
అమరావతి – పొత్తులో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రస్తుతం టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా చేరింది. మూడు పార్టీలు ఒకే వేదికను పంచుకోనున్నాయి. రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం సై అంటోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలిగా గుర్తింపు పొందిన వైఎస్ షర్మిలా రెడ్డి నేత్వంలో కొత్త పుంతలు తొక్కుతోంది ఆ పార్టీ.
దీంతో ఈసారి రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని, అంతకు మించి ఉత్కంఠను కలుగ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా నిన్నటి దాకా ప్రధాన మంత్రి మోదీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను ఏకి పారేసిన చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి వారి మెప్పు కోసం సాగిల పడటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎదురే లేని నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. ఏపీ స్కిల్ స్కామ్ తో పాటు మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఇందులో భాగంగా 53 రోజుల పాటు చంద్రబాబు ను జైలుపాలు చేసింది. ఇది పక్కన పెడితే పొత్తులో భాగంగా ట్రబుల్ షూటర్ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తమ పార్టీకి చెందిన ఓట్లు మీ పార్టీలకు చేరుతాయని, ఇదే సమయంలో మీ పార్టీలకు చెందిన ఓట్లు తప్పనిసరిగా తమకు వేసేలా చూడాలని చంద్రబాబును ఆదేశించినట్లు టాక్.