రతన్ టాటా లేక పోవడం బాధాకరం – మహీంద్రా
నేను అంగీకరించ లేక పోతున్నాను
ముంబై – మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తీవ్ర సంతాపం తెలిపారు. దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా లేరన్న వార్తను తాను తట్టుకోలేక పోతున్నానని పేర్కొన్నారు. గురువారం ఎక్స్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ఇప్పటికీ తాను నమ్మడం లేదన్నారు.
తనకే కాదు యావత్ భారత దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు ఆనంద్ మహీంద్రా. ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మకమైన ముందడుగులో ఉంది. ఈ సమంలో రతన్ టాటా సేవలు అవసరమవుతాయి. కానీ ఈ కీలక సందర్బంలో రతన్ జీ లేక పోవడం అత్యంత బాధ కలిగిస్తోందని వాపోయారు ఆనంద్ మహీంద్రా.
ఈ సమయంలో మార్గదర్శకత్వం అత్యంత అమూల్యమైనదని, ఇది ఒక రకంగా యావత్ వ్యాపార రంగానికి పెద్ద నష్టమని వాపోయారు. సంపదను సృష్టించడమే కాదు దానిని పది మందికి పంచిన గొప్ప నాయకుడు, అరుదైన మానవుడు రతన్ టాటా అని పేర్కొన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ భగవంతుడు టాటా కుటుంబానికి, లక్షలాది ఉద్యోగులకు శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నానని తెలిపారు ఆనంద్ మహీంద్రా. ఏది ఏమైనా లెజెండ్స్ ఎప్పటికీ మరణించరని స్పష్టం చేశారు.