స్కిల్స్ యూనివర్శిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా
ఉండమని కోరామన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి
అమెరికా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం న్యూ జెర్సీలో నిర్వహించిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీకి చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త , మహీంద్రా గ్రూప్ కంపెనీల చైర్మన్, ఎండీ ఆనంద్ మహీంద్రాను ఉండాలని తాను కోరానని చెప్పారు.
వ్యాపార రంగంలో లాభాపేక్ష లేకుండా కేవలం పరిణతి కలిగిన వ్యాపారవేత్తగా ఇప్పటికే ఆనంద్ మహీంద్రా గుర్తింపు పొందారని తెలిపారు. తనను స్కిల్స్ యూనివర్శిటీలో భాగం కావాలని , తనే చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాలని తాను సూచించానని ఇందుకు ఆనంద్ మహీంద్రా కూడా ఆలోచిస్తానని చెప్పారని తెలిపారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా సీఎం, మహీంద్రాల మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్స్ యూనివర్శిటీలో ఆటోమొబైల్స్ కు సంబంధించి తాము పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.