నితీశ్ కుమార్ రెడ్డికి నజరానా
రూ. 25 లక్షలు ప్రకటించిన ఏసీఏ
అమరావతి – ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఏపీలోని విశాఖకు చెందిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి భారీ నజరానా ప్రకటించారు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీకి చెందిన తమ కుర్రాడు అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడని ప్రశంసలు కురిపించారు. తన ఆటతీరుతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేశాడని పేర్కొన్నారు. బలమైన ఆస్ట్రేలియా జట్టుతో ఆతిథ్య దేశంలో దుమ్ము రేపాడని, ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నారు.
కళాత్మకమైన , సొగసైన షాట్స్ తో అలరించాడని, ప్రధానంగా పాట్ కమిన్స్ బౌలింగ్ లో కొట్టిన షాట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్టేడియంగా పేరు పొందిన మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో ఓ వైపు స్టార్ క్రికెటర్లు వెనుదిరిగినా నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం ఒంటరి పోరాటం చేశాడని కితాబు ఇచ్చారు.
తన అద్భుతమైన శతకతంతో ఆకట్టుకున్న రెడ్డికి తమ అసోసియేషన్ తరపున రూ. 25 లక్షలు బహుమానంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీటిని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేస్తాంమన్నారు.