ఆర్జీవీకి హైకోర్టు బెయిల్ మంజూరు
విచారణకు సహకరించాలని ఆదేశం
అమరావతి – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆర్జీవీకి సంబంధించి నమోదైన అన్ని కేసులకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో విచారణకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఆయనపై ఏపీలోని పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని , ఎక్స్ వేదికగా వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చేలా చేశారంటూ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కేసు నమోదైంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు.
చివరకు లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం కలకలం రేపింది. దీనిని సవాల్ చేస్తూ రామూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాది డాక్టర్ బాలు వాదించారు. తాను తీసిన వ్యూహం విడుదలై ఏడాదైందని, ఈ సినిమాను ఆధారంగా చేసుకుని ఇప్పుడు తనపై ఫిర్యాదులు చేయడం దారుణమని పేర్కొన్నారు. తనను కావాలని టార్గెట్ చేయడం పట్ల అభ్యంతరం తెలిపారు.