శ్రీవారి భక్తులకు శుభవార్త
దర్శనం టికెట్లు విడుదల
తిరుమల – కోట్లాది మంది శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. స్వామి వారి దర్శన భాగ్యం కలిగితే చాలు జన్మ ధన్యం అవుతుందని భావించే వారికి దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఈ మేరకు కీలక ప్రకటన చేశారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు.
సామాన్య భక్తులకు దర్శనం విషయంలో త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. పైరవీలకు, మధ్య దళారీలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా ఇవాళ ఆన్ లైన్ లో వచ్చే అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా స్వామి దర్శనానికి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు రిలీజ్ చేస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. జూలై 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు ఈవో.