వస్త్రాలను ధరిద్దాం..నేతన్నలను ఆదుకుందాం
పిలుపునిచ్చిన ఏపీ హోం శాఖ మంత్రి అనిత
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కీలకమైన పండుగలు రాబోతున్నాయి. ఈ సందర్బంగా చేనేతలకు తీపి కబురు చెప్పారు. ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నేతన్నలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు హోం శాఖ మంత్రి.
ఆదివారం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనమ్మ ఇచ్చిన పిలుపు మేరకు చేనేతలకు అండగా నిలబడాలని కోరారు. ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి..రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.
రాబోయే రోజుల్లో వరుస పండుగల నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే వస్త్రాలను ధరించడంతో పాటు చేనేతల కళా రూపాలకు పెద్దపీట వేయాలన్నారు. మన కుటుంబంతో పాటు మన ఇంట్లో ఆనందంగా పండుగ చేసుకోవడంతో పాటు చేనేత వస్త్రాలపై ఆధారపడి బతికే అందరి ఇళ్లల్లో పండుగ సంతోషం నింపాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు.