విద్యార్థిని మృతి అత్యంత బాధాకరం
నిందితుడిని శిక్షించేందుకు విచారణ
అమరావతి – కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం ఆమె ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అత్యంత దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి దాకా బాధితురాలిని బతికించేందుకు ప్రయత్నం చేసిందన్నారు.
ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం దారుణమన్నారు అనిత వంగలపూడి. ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నానని, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎలాగైనా విద్యార్థినిని కాపాడాలని ఆదేశించారని తెలిపారు ఏపీ మంత్రి.
నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తమకు తెలియ చేశారని వెల్లడించారు. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సిఎం ఆదేశించారని పేర్కొన్నారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బాధితురాలి కుటుంబాన్ని తమ సర్కార్ ఆదుకుంటుందని స్పష్టం చేశారు అనిత వంగలపూడి.