మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – ప్రజల నమ్మకాన్ని..ప్రభుత్వ ప్రతిష్ఠను నిలబెట్టాలని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. పోలీస్, న్యాయ వ్యవస్థల్లో మహిళా సాధికారత పెరుగుతోందన్నారు. పోలీస్, ప్రాసిక్యూటర్ల సమన్వయంతోనే సత్వర న్యాయం జరుగుతుందన్నారు. సర్వం కోల్పోయి మీ దగ్గరకి వచ్చిన వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉయ్యాలలో ఉన్న పసిపాపలపై అత్యాచారాలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు అనిత. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళనకరమన్నారు.
విజయవాడలోని జీఆర్టీ హోటల్ వేదికగా జరిగిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో హోంమంత్రి అనిత ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మరింత పేరు తీసుకు వచ్చేలా చేయాలని స్పష్టం చేశారు.
పోలీస్, న్యాయ వ్యవస్థల్లో మహిళా సాధికారత పెరుగుతుండడం శుభపరిణామం అన్నారు. పోలీస్, ప్రాసిక్యూటర్ల సమన్వయం తోనే సత్వర న్యాయం సాధ్యమవుతుందన్నారు. సర్వం కోల్పోయి వచ్చిన వారికి అండగా నిలబడాలని హోంమంత్రి పిలుపునిచ్చారు.
ప్రతి వ్యక్తి తనకు తాను నిఘా పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి సమాజంలో ఏర్పడిందని పేర్కొన్నారు. దొంగలు చాలా తెలివి మీరిపోయారన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు చాలా అవసరమన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలన్నారు. ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.