టీటీడీ చైర్మన్ ను కోరిన మంత్రి అనిత
తిరుమల – అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత వంగలపూడి తిరుమలలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును కోరారు. ఈ సందర్బంగా ఆమె వినతిపత్రాన్ని సమర్పించారు.
అంతకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ క్యాంపు కార్యాలయంలో చైర్మన్, ఈవోలతో భేటీ అయ్యారు. ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా ఉపమాక ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు అనిత వంగలపూడి.
ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అత్యంత ప్రాశస్త్యం గల ఉపమాక ఆలయాన్ని 2017లోనే ఆనాటి సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అప్పగించడం జరిగిందని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఉపమాక ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకురావాలని చైర్మన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన చైర్మన్ ఆలయ అభివృద్ధికి తగు చర్యలు చేపడతామని అనిత వంగలపూడికి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు, టీటీడీ బోర్డు సభ్యులు ఎం.ఎస్.రాజు, సీఈ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.