స్పష్టం చేసిన వంగలపూడి అనిత
అమరావతి – అభివృద్ది, సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత.
గత ప్రభుత్వంలో అంగుళం కూడా ముందుకు సాగలేదన్నారు. పదేళ్ల సమగ్ర రక్షిత తాగునీటి పథకం ప్రాజెక్టు పూర్తికోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. 140 గ్రామాలకు నీరందించడమే లక్ష్యంగా పైప్ లైన్ పనులకు నెలకొన్న అడ్డంకులు తొలగించామన్నారు. నేషనల్ హైవే అధికారులు, జిల్లా కలెక్టర్‌తో సమీక్ష చేపట్టారు మంత్రి. ఈ పథకం వల్ల నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో తాగునీటి ఎద్దడి తొలగుతుందన్నారు.
పైప్ లైన్ ద్వారా వచ్చిన ఏలేరు కాలువ నీటిని పేటకు తీసుకు రావడానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలయ్యాయని తెలిపారు వంగలపూడి అనిత. నాతవరం మండలం శరభవరం వద్ద మోటారు ఏర్పాటు, షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. 2017లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నాటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లి ఎన్ఆర్డీడబ్ల్యూపీ కింద రూ.51 కోట్ల కేటాయింపులు జరిపారన్నారు.నీటి శుద్ధి ట్యాంకులు, స్టోరేజ్ ట్యాంకుల వంటి 80 శాతం పనులు అప్పటికే పూర్తి అయ్యాయని చెప్పారు. జగన్ హయాంలో శంకుస్థాపన చేసిన పనులు నేటికీ పూర్తికాని దుస్థితి ఏర్పడిందన్నారు. త్వరలోనే మెగా ప్రాజెక్టు పూర్తి చేసి మిగతా 130 గ్రామాలకు నీరందించేందుకు కృషి చేస్తామన్నారు.