పోలీసు అమర వీరులకు సెల్యూట్
ఏపీ హోం శాఖ మంత్రి అనిత
విజయవాడ – కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులైన పోలీసు వీరులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. సోమవారం విజయవాడలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు హోం శాఖ మంత్రి, డీజీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వంగలపూడి అనిత ప్రసంగించారు. అసాంఘిక శక్తులను ఎదిరించి వీర మరణం పొందిన కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు, ప్రసాద్ బాబు వంటి మహనీయులకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలీస్ అమర వీరుల కుటుంబాలు సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు అనిత వంగలపూడి. టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తామని అన్నారు.
విజయవాడ కమిషనరేట్ కేంద్రంగా సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చామని చెప్పారు.
సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై సామాన్యులకు తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు అనిత వంగలపూడి.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాజీ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ప్రత్యేక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
గత ప్రభుత్వంలో నిలిచిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తామని ప్రకటించారు వంగలపూడి అనిత. తుపానులు, వరదలు, దసరా శరన్నవరాత్రులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల పనితీరు ప్రశంసనీయమని కొనియాడారు.
విజయవాడ వరదల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది శభాష్ అనిపించేలా సేవలు అందించారని అన్నారు. నవతరానికి ఉత్సాహాన్ని స్ఫూర్తిని, ప్రేరణను రగిలించడమే పోలీసు అమరవీరుల సంస్మరణ నిర్వహణ ఉద్దేశ్యం అన్నారు.