48 గంటల్లో కేసు ఛేదించాం – హోం మంత్రి
అత్యాచార ఘటన బాధాకరమన్న అనిత
అమరావతి – ప్రస్తుత సమాజంలో పోలీసులకు గన్ ఆయుధమైతే..సామాన్య ప్రజలకు ఫోన్ ఆయుధమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. కళ్ల ముందు జరిగిన ఘటలపై స్పందించి ముందుకు వస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి అండగా ఉంటామన్నారు.
బాపట్ల జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలలో మహిళలపై జరిగిన అత్యాచార కేసులలో విచారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 12న అత్తాకోడళ్లపై జరిగిన అఘాయిత్యం చాలా దురదృష్ట కరమన్నారు.
ఓ వైపు దసరా నవరాత్రులు, మరో వైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తులో పోలీసులు నిమగ్నమై ఉన్నా..టెక్నాలజీ ఉపయోగించి ఈ కేసును 48 గంటల్లో ఛేదించామన్నారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నేరానికి పాల్పడినా 200కి.మీ ప్రయాణించి, కొండలు, గుట్టలు ఎక్కి చాకచక్యంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు.
ఈ ఘటనకు పాల్పడిన అనుమానితులను ఐదుగురిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఈ ఐదుగురిలో ముగ్గురు మైనర్లతో పాటు 32 దోపిడీ కేసుల చరిత్ర కలిగిన నేరస్థుడున్నాడని పేర్కొన్నారు. మైనర్లంతా ఈ మధ్యలోనే ఈ గ్యాంగ్ లోకి వచ్చినట్లు హోం మంత్రి అన్నారు.
వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో డీజీపీ ద్వారకా తిరుమల రావుతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో హోం మంత్రి అనిత మాట్లాడుతూ చిన్నారులు, మహిళలపై జరిగే అఘాయిత్యాలను ఉపేక్షించేది లేదన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనలపై దృష్టి సారించి, సమీక్షలు జరిపి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.