వైసీపీ ఎమ్మెల్సీలపై వంగలపూడి ఫైర్
సభ జరగకుండా అడ్డు పడితే ఎలా..?
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. గురువారం జరిగిన శాసన మండలి సభలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా అప్రజాస్వమికమని పేర్కొన్నారు.
శాసన మండలిలో హోం మంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్యాణికి కౌంటర్ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో చిరుద్యోగుల స్థాయి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వారి వరకూ జీతాలే సరిగా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు.
టీఏ, డీఏ, సరండర్ లీవ్ లు, ఐఆర్, ఇంక్రిమెంట్లు, పీఆర్సీలు ఏవీ ఇవ్వక పోవడంతో నానా ఇబ్బందులు పడ్డారని ఆవేదన చెందారు. కానీ తాము వచ్చాక వారికి వేతనాలు ఒకటో తారీఖునే అందజేశామన్నారు.
గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనా అల్లకల్లోలం గురించి వదిలేసి ఐదు నెలల ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు వంగలపూడి అనిత. కూటమి ప్రభుత్వంలో ఒకటో నెల వచ్చేసరికి జీతాలు పొందుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులలో సంతోషం కలుగుతోందన్నారు.
ఐదేళ్లు జీతాలు సక్రమంగా ఇవ్వలేక పోయిన వారు కొత్త ప్రభుత్వాన్ని పీఆర్సీల గురించి అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి. తమ పత్రికలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని సభలో ప్రస్తావిస్తే ఎలా అని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఇస్తోన్న ఉచిత సిలిండర్లపై అవాస్తవాలు మాట్లాడడం మంచిది కాదన్నారు. విపక్ష సభ్యులు బడ్జెట్ పై అవగాహనతో మాట్లాడితే బాగుంటుందన్నారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశామని చెప్పారు అనిత వంగలపూడి.
స్త్రీనిధికి రూ.3,500 కేటాయించినా మహిళలకు రూపాయి కూడా కేటాయించ లేదనడం సబబా? అని అన్నారు. సత్యాలు చెప్పి సభలో సద్విమర్శ చేస్తే ఆలోచించుకుని సరి చేసుకుంటామన్నారు.