మండలిలో వంగలపూడి అనిత
అమరావతి – హోం మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వీఆర్ వేరు, సస్పెన్షన్ వేరు అని పేర్కొన్నారు. ఈ రెండింటి విషయంలో ఎమ్మెల్సీలు పొరపాటు పడుతున్నారని అన్నారు . టీడీపీ సానుభూతిపరులని భావించి గతంలో పోలీసులను వీఆర్ లో ఉంచారని ఆరోపించారు. తమ కూటమి ప్రభుత్వ విధానం అది కాదన్నారు. ఆ సంస్కృతి తాము అమలు చేయ బోవడం లేదన్నారు అనిత. 2014-19 సమయంలో వీఆర్ లో ఉన్న వారికి 50 శాతం జీతాలు చెల్లించారని తెలిపారు. గత సర్కార్ వీఆర్ సాకుతో పైసా కూడా ఇవ్వలేదన్నారు.
జగన్ పాలనలో కొందరు పోలీసులను నాలుగేళ్ల పాటు వీఆర్ లో ఉంచారని ఆరోపించారు వంగలపూడి అనిత. ప్రస్తుతం 199 మంది పోలీసులు వీఆర్‌లో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంలో ఆరోపణలు, వివాదాస్పద నిర్ణయాలప్పుడే వీఆర్‌లో ఉన్నారని గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు వంగలపూడి అనిత. వీఆర్ అంటే కూటమి ప్రభుత్వంలో వెయిటింగ్ పీరియడ్ మాత్రమేనని అన్నారు. విచారణ పూర్తై అనుమతి రాగానే పెండింగ్ బిల్లులు, శాలరీలు ఒకేసారి చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఏళ్లకేళ్లు జీతాలివ్వకపోతే ఏం చేశారని ఎంఎల్‌సీ ఏసురత్నాన్ని ప్రశ్నించారు మంత్రి.