ఘనంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
అమరావతి – నక్కపల్లి ఉపమాకలో వేంచేసిన వేంకటేశ్వర స్వామికి మంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి వార్షిక కల్యాణోత్సవం సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో మంత్రికి నాయకులు, దేవస్థాన అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అంతరాలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రికి ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాల్ని పండితులు అందజేశారు. అనంతరం భరత నాట్య కళాకారుల్ని మంత్రి అనిత ఘనంగా సత్కరించారు. హోం మంత్రి ఆర్థిక సహాయంతో ఉపమాక ఆలయం వద్ద మజ్జిగ, క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని.. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని తెలిపారు.
గత ప్రభుత్వంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, కూటమి ప్రభుత్వ హయాంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించానన్నారు. తిరుమల తిరుపతి స్వామి వారి ప్రసాదం కూడా ఉపమాకలో అందుబాటులో ఉందని తెలిపారు. భక్తులకు మజ్జిగ, భోజనం సౌకర్యం ఏర్పాటు చేశామని, ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసారు.