రేపే శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన మంగళవారం సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్య కాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
అయితే సౌర మానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణి మాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వ దినం నాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఈ ఉత్సవం రోజున ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వ భూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతునికి అభి ముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు.
మరో పీఠంపై స్వామి వారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనుల వారు దక్షిణాభి ముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూల మూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామి వారికి, మరొకటి విష్వక్సేనుల వారికి అలంకరిస్తారు.
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం” (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామి వారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామి వారిని ఆశీర్వదిస్తారు.
ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి వారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామి వారికి, టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.
ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.