DEVOTIONAL

ఘ‌నంగా ఆణివార ఆస్థానం

Share it with your family & friends

వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు

తిరుమల – తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు పాల్గొన్నారు.

ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వ భూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు.

మరో పీఠంపై స్వామి వారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు.

అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూల విరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం” (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామి వారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు.

ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ , శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ ల‌కు టీటీడీ తరఫున ఈవోకి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. ”రూపాయి” హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది.