18వ తేదీ వరకు కొనసాగుతునున్న ఉత్సవాలు
తిరుపతి – పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు మే 12 నుండి 18వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగనున్నాయి. ఇందులో భాగంగా మే 12వ తేదీన తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం 10.30 గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా తాళ్ల పాకలో 12 నుండి 14వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తాళ్లపాకలోని ధ్యాన మందిరం వద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మే 13 నుండి 17వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు నిర్వహిస్తారు. మే 12 నుండి 18వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రముఖ కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.