బకాయిలు చెల్లించండి విద్యార్థులను కాపాడండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎ. రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన గురుకులాలు, ప్రభుత్వ బడులు, ఇతర సంస్థల పట్ల నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. గత 10 నెలలుగా పేరుకు పోయిన అద్దె బకాయిలను చెల్లించక పోవడంతో చాలా చోట్ల ఆయా సంస్థలకు యజమానులు తాళాలు వేయడం విస్తు పోయేలా చేసిందన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న ప్రజా పాలన అని నిలదీశారు. కేబినెట్ లో ప్రధానమైన శాఖలను రేవంత్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నాడని, దీంతో వాటి పట్ల ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా విద్యా సంస్థలు తయారయ్యాయని వాపోయారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
తాళాలు పడింది పేద, బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన వేలాది మంది పిల్లల భవిష్యత్తుకు అని సీఎం అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. తాళాలు పడింది బడులకు కానది ప్రభుత్వ విద్యా వ్యవస్థకు, తెలంగాణ పరువు ప్రతిష్టలకు, బ్రాండ్ ఇమేజ్ కు అని గుర్తిస్తే మంచిదన్నారు.
మంచి పనులు ఎవరు చేసినా లేదా ఏ పార్టీ , ఏ ప్రభుత్వం తీసుకు వచ్చినా వాటిని మానవతా దృక్ఫథంతో అర్థం చేసుకుని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేయాలని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కేవలం కక్ష సాధింపు ధోరణితో, పంతానికి పోయి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునేలా దెబ్బ తీయడం దారుణమన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తేవడం ఎంత ముఖ్యమో అదే సమయంలో అన్ని పాఠశాలలను కాపాడు కోవడం కూడా అంతే అవసరమన్నారు. తక్షణమే గురుకుల పాఠశాలలకు పెండింగ్ లో ఉన్న అద్దె బకాయిలు సకాలంలో చెల్లించి విద్యార్ధుల భవిష్యత్ ను కాపాడాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత.