తెలంగాణ తండ్లాట రైతుల కొట్లాట
రైతుల అరెస్ట్ అప్రజాస్వామికం
హైదరాబాద్ – తమ భూములు ఫార్మా కంపెనీకి ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పిన రైతులకు బేడీలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతుల పట్ల అనుసరించిన విధానం పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
తర తరాల నుంచి , తాత ముత్తాల నుంచి భూమిని నమ్ముకుని సాగు చేస్తున్న వారి పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన పేరుతో మీరు చేస్తున్న నిరంకుశ పాలనకు నిలువెత్తు నిదర్శనం ఈ అరెస్ట్ ల పర్వం అని అన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
మిమ్మల్ని గెలిపించింది, సీఎంను చేసింది రైతులకు చెందిన భూములను లాక్కునేందుకు కాదని, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఓటు వేశారని గుర్తు పెట్టుకోవాలన్నారు. తన అల్లుడు, సోదరుల కోసం భూములను బలవంతంగా లాక్కుంటామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలలో అసంతృప్తి మొదలైందని, దానిని గుర్తించి తొలగించేందుకు ప్రయత్నం చేయాలని లేక పోతే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు .