గాడి తప్పిన పాలన టీచర్లతో కుల గణన
నిప్పులు చెరిగిన ఏనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణలో విద్యా రంగం నిర్లక్ష్యానికి గురైందని, నిధులు విడుదల చేయక పోవడంతో సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకులాలు, పాఠశాలలలో చదువుకుంటున్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పుండు మీద కారం చల్లినట్లు కుటుంబ సర్వే పేరుతో కుల గణన కోసం ప్రభుత్వ టీచర్లను ఉపయోగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోవడం, మీ మేరకు విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పటికే అరకొర చదువులు చదువుకుంటున్న విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
టీచర్లను కాకుండా ఇతర పని లేని శాఖలు చాలా ఉన్నాయని, ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులతో కుల గణన చేపట్టాలని సూచించారు. అంతే కాకుండా వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు జాబ్స్ లేక అల్లాడుతున్నారని, కొంత మొత్తంగా ఇచ్చి, శిక్షణ ఇవ్వగలిగితే వారే కుల గణన సర్వే చేపడతారని ఆ దిశగా ఆలోచించాలని ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకే ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టడం జరిగిందన్నారు. మరి సోయి లేని సీఎంకు ఈ దిక్కుమాలిన ఆలోచన ఎట్లా వచ్చిందో , ఎవరు ఇచ్చారో పునరాలోచించు కోవాలని హితవు పలికారు.