గ్రూప్ 4 అభ్యర్థులకు న్యాయం చేయండి
బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్ – రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ మాటేమిటో కానీ అసంబద్ద నిర్ణయాల కారణంగా అభ్యర్థులు , నిరుద్యోగులు, ఆశావహులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రధానంగా గ్రూప్-4 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రూప్ -4 పరీక్ష రాసే అభ్యర్థులు అన్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారని, వారి న్యాయ పరమైన డిమాండ్ ను వెంటనే పరిష్కరించాలని కోరారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
గ్రూప్ 4 ఉద్యోగాలు బ్యాక్ లాగ్ కాకుండా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో చాలామంది ఉద్యోగార్థులు గ్రూప్ 4 కన్నా, పైస్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
వారు ఎంపిక కాకుండా మిగిలిన పోస్ట్ లను బ్యాక్ లాగ్ కాకుండా 1:3 నిష్పత్తి లో ఉన్న ఉద్యోగార్థులకు అవకాశం కల్పిస్తే సుమారు 3 నుండి 4 వేల మందికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఇందుకు సంబంధించి గ్రూప్ -4 అభ్యర్థులు పలుమార్లు మంత్రులు, టీజీపీఎస్సీ చైర్మన్ ను కలిసినా ఇప్పటి వరకు స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.