స్కూళ్లు బంద్ చేస్తే ఎలా..?
రాకేశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని వరంగల్ లో స్కూళ్లను బంద్ చేయడం దారుణమని పేర్కొన్నారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ వచ్చిన సమయంలో కూడా వరంగల్ లో బడులను మూసి వేయలేదని గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ వచ్చిన సమయంలో కూడా ఇలా చేయలేదని పేర్కొన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
కానీ విచిత్రం ఏమిటంటే ఈసారి అందుకు విరుద్దంగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని నగరంలో స్కూళ్లను బంద్ చేయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల మీరు ప్రజలకు, పేరెంట్స్ కు, పిల్లలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఇప్పటికే విద్యా వ్యవస్థ గాడి తప్పిందని, గురుకులాలు, ఇతర విద్యా సంస్థలలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇకనైనా ఇలాంటి నిర్ణయాలు మానుకోవాలని సూచించారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.