ఇది ప్రజా విజయం – రాకేశ్ రెడ్డి
లగచర్ల ప్రజల పోరాటం ఫలించింది
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల గ్రామంలో భూ సేకరణ చేయడం లేదంటూ ప్రకటించడాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయం ప్రజలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. బాధితులకు ముందు నుంచి అండగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిందన్నారు. తమ నాయకుడు కేటీఆర్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చారని , వారు చేసిన ఆందోళనకు సర్కార్ దిగిరాక తప్పలేదన్నారు.
తొలుత హైడ్రా కూల్చివేతలు ఆపారని, తర్వాత మూసి సుందరీకరణ కాదు మూసి ప్రక్షాళన అని మాట మార్చారని ఆరోపించారు. నిన్న దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు చేసిన ఆందోళనతో దిగిరాక తప్పలేదన్నారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదంటూ ప్రకటించారని అన్నారు. ఇవాళ లగచర్ల భూ సేకరణ చేయడం లేదంటూ చెప్పడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు .
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెబుతూ వచ్చారని, కానీ చివరకు ఆయన పేరు ఎత్తకుండా పాలన సాగించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రేవంత్ రెడ్డి తన ఆనవాళ్లను మిగుల్చు కునేందుకు నానా తంటాలు పడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.