అప్రకటిత ఎమర్జెన్సీ విధిస్తారా..?
ఇదేనా మీరు చెప్పిన ప్రజా పాలన
హైదరాబాద్ – రేయింబవళ్లు శాంతి భద్రతల విషయంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్న పోలీసు సోదర, సోదరీమణుల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు ధోరణి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. వాళ్లు మనలాంటి మనుషులేనని ఎందుకు భావించడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో తనకు పోలీసులంటే గౌరవం ఉందని, వారిని కంటికి రెప్పలా చూసుకుంటామని, అధికారంలోకి వస్తే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అని నిలదీశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
ప్రజాస్వామ్యంలో ఉద్యోగులకు కూడా హక్కులు ఉంటాయని, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం, నిలదీయడం , తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా సామాజిక వేదికల మీద తెలియ పర్చడం సహజమేనని..కానీ వీటిపై కూడా ఉక్కుపాదం మోపితే ఎలా అని వాపోయారు.
మొన్న పలువురు పోలీసులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న కర్ఫ్యూ విధిస్తున్నామని ప్రకటించారు..ఇవాళ టీజీఎస్పీ పోలీసులు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దంటూ హుకూం జారీ చేశారని..రేపు తెలంగాణ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తారేమోనని ఎద్దేవా చేశారు. అందుకేనేమో పదే పదే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. ప్రభుత్వం, సీఎం భేషజాలకు పోకుండా పోలీసుల సమస్యలను పరిష్కరించాలని ఏనుగుల రాకేశ్ రెడ్డి కోరారు.