ఆస్పత్రి పాలైనా పట్టించుకోక పోతే ఎలా..?
మంత్రి కొండా సురేఖపై రాకేశ్ రెడ్డి ఫైర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం పట్ల మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే చివరకు గురుకులాలు అనేవి పేరుకు మాత్రమే మిగిలి పోతాయేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
ఓ వైపు సరైన ఆహారం అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరో వైపు అనారోగ్యానికి గురైనా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని వాపోయారు. కీలకమైన హోం శాఖతో పాటు విద్యా శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారని, ఆయనకు కేసీఆర్ ను, కేటీఆర్ ను, బీఆర్ఎస్ నేతలను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. పాలన గాడి తప్పిందని, సోయి తప్పి మాట్లాడితే ఎలా అని నిప్పులు చెరిగారు.
విచిత్రం ఏమిటంటే ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఆస్పత్రిపాలైన విద్యార్థుల పట్ల చులకనగా మాట్లాడం దారుణమన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. పసిపిల్లలను పరామర్శించాల్సింది పోయి నిర్లక్ష్యంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మతనం మరిచి పోయి మాట్లాడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గురుకులాలను మూసేయాలన్న కుట్రతో చిన్నారుల ప్రాణాలు పోతున్నా పట్టించు కోవడం లేదని ఆరోపించారు.
విద్యా సంస్థలలో మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని, అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైన విద్యార్థులకు వైద్య సాయం అందించాలని కోరారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.