విదేశీ టూర్లు సరే ప్రజల కష్టాల మాటేంటి..?
నిప్పులు చెరిగిన ఏనుగుల రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టిందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పోయాయని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అయినా సీఎం మొద్దు నిద్ర పోతుండడం దారుణమన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా రేయింబవళ్లు పని చేస్తున్న పోలీసు కుటుంబాలపై పోలీసులతో దాడులు చేయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. పోలీసుల్లో అశాంతి నెలకొంటే అది ప్రభుత్వానికే కాదు తెలంగాణ సమాజానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వెంటనే సీఎం స్పందించాలని, డీజీపీ జోక్యం చేసుకోవాలని , రేయింబవళ్లు పని చేసే పోలీసులకు భరోసా కల్పించాలని కోరారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
ఇక రోమ్ తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఒకవైపు గ్రూప్1 గ్రూప్4, GO 46, పోలీస్ కానిస్టేబుల్ ల భార్యా పిల్లలు, ఆశాలు, ఏ ఈ ఓ లు, ఇంకో వైపు హైడ్రా, మూసీ బాధితులు, మరో వైపు రైతులు రోడ్డెక్కి సమస్యల పై పోరాటం చేస్తుంటే మంత్రులు మాత్రం విదేశీ పర్యటనల పేరుతో మస్తు ఎంజాయ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
సొల్లు కబుర్లు, అక్కరకు రాని ముచ్చలు, గాలి మోటార్లలో తిరగడం తప్పా ఈ 11 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేసిన ఒక్క మంచి పని లేదన్నారు.